దళం వీడి జనంలోకి ! 1 m ago
అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మన్యంలో మావోయిస్ట్ పార్టీ దళ సభ్యురాలు బుధవారం చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయింది. ఆంధ్రా సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని దులోడ్ గ్రామానికి చెందిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ బస్తర్ డివిజినల్ కమిటీ టైలరింగ్ బృందం సభ్యురాలు సోడి సుక్కి లొంగిపోయారు. ఈమెకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు పామేడు ఏరియా కమిటీ, సీఎన్‌ఎమ్ అధ్యక్షుడు తరుచూ దులోడ్ గ్రామాన్ని సందర్శిస్తూ పాటలు, నృత్యాల ద్వారా మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంతో ఆమె మావోయిస్టు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో 2022 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సోడి సుక్కీని ఏ సెక్షన్ ఫ్లాటూన్, సెకండ్ కంపెనీ పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యురాలుగా నియమించారు. ఈమెకు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి పార్టీ సభ్యురాలుగా పదోన్నతి కల్పించి అగ్రికల్చరల్ బృందానికి బదిలీ చేశారు. ఈమె మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు 2023లో మెట్టగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈవోఎఫ్ ఘటనలో పాల్గొన్నారు.
తల్లి మరణంతో పార్టీని వీడింది
సోడి సుక్కీ తల్లి ఈ ఏడాది జనవరిలో మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని చూడటానికి కూడా మావోయిస్ట్ పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ తరుణంలోనే మావోయిస్టు పార్టీ సిద్దాంతాలకు విసిగిపోయిన ఆమె లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రశాంత జీవనం గడిపేందుకు
మావోయిస్ట్ పార్టీని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన సోడి సుక్కీకు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు రూ. 1 లక్ష రూపాయల నగదు, ఇతర వసతులు కల్పిస్తామని ఏఎస్పీ పంకజ్ కుమార్ పేర్కోన్నారు. ప్రస్తుతానికి ఆమెకు దుస్తులు, నిత్యవసర వస్తువులను అందజేశారు. మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సహాయక కమాండెంట్ దివాకర్, చింతూరు సీఐ దుర్గా ప్రసాద్, ఎస్సై పేరూరి రమేష్, గజేంద్ర కుమార్, ఎస్సై శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.